.

.

nani

25, మే 2015, సోమవారం

శనగలతో మామిడి ఆవకాయ / Mango Pickle with Chick Peas

వేసవిలో మామిడికాయతో  చాలా రకాల ఆవకాయలు పెడతారు. వాటిలో ఒకటి ఈ శనగల ఆవకాయ.ఈ ఆవకాయలో మామిడి పులుసు,కారం,ఉప్పు లో నానిన శనగల రుచి చాలా బాగుంటుంది.ఇది మా అమ్మమ్మ కాలం నాటి ఆవకాయ.అప్పటి రోజుల్లో ఈ ఆవకాయలో  నల్ల శనగలు ఎక్కువగా వాడేవాళ్ళు.. ఇప్పుడు కాబూలీ చనా ఉపయోగిస్తున్నారు. ఏ శనగల్ని వాడినా వాటిని నానబెట్టి కానీ,ఉడకబెట్టి కానీ వేయకూడదు.నీళ్ళలో శుభ్రంగా కడిగి,గుడ్డతో తడంతా పోయేలా తుడిచి,కొంచెం కూడా చెమ్మ లేకుండా ఆరబెట్టిన శనగల్ని మాత్రమే వేయాలి. 




కావలసినవి 

పుల్లగా,గట్టిగా ఉండే మామిడికాయ ముక్కలు  - మానెడు 
పచ్చి శనగలు - 1 గిద్ద
కారం - 2  గిద్దలు 
ఉప్పు - 2 గిద్దలు 
(రాళ్ళ  ఉప్పు మిక్సీ లో  పొడి చేసి వేసుకోవాలి  )
ఆవాలు - 100 గ్రాములు 
మెంతులు - 25 గ్రాములు 
జీలకర్ర - 25 గ్రాములు 
పసుపు - 1 టేబుల్ స్పూన్ 
వెల్లుల్లి రేకలు - 1/4 k.g 
నువ్వుల నూనె/పల్లీ నూనె - 1/2 కిలో (ముక్కలు మునిగేంత)



తయారుచేసే విధానం

మామిడి కాయలు శుభ్రంగా కడిగి, ముక్కలు కొట్టించి,
ముక్కల్ని పొడి గుడ్డతో తుడిచి, 
లోపలున్న పొర,జీడి  లేకుండా జాగ్రత్తగా తీసేయాలి.

 


ఆవాలు,మెంతులు,జీలకర్రలను శుభ్రం చేసి,
కొద్దిసేపు ఎండలో పెట్టి 
వేయించకుండా,పచ్చివాటినే మెత్తగా పొడి చేయాలి. 




ఒక వెడల్పాటి టబ్ లో మామిడికాయముక్కలు 
శనగలు వేయాలి. 


వీటిలో 2 గిద్దల ఉప్పు, 
1 టేబుల్ స్పూన్ పసుపు వేసి,అంతా  కలిసేలా 
బాగా కలపాలి


ఉప్పు,పసుపు కలిపిన శనగలు,మామిడికాయముక్కల్ని
1/2 గంట సేపు కదల్చకుండా పక్కన పెట్టాలి. 

అలా అరగంట పక్కన ఉంచిన మామిడికాయ ముక్కల్లో 
నుండి పులుసు ఊరుతుంది. 



పులుసు ఊరిన మామిడికాయ ముక్కల్లో కొలత ప్రకారం 
తీసుకున్న కారం,ఆవపిండి,మెంతిపిండి,
జీలకర్రపొడి,వెల్లుల్లి రెబ్బలు కొన్ని,
కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కొన్ని వేయాలి


పొడులన్నీ బాగా కలిసేలా కలపాలి.



కలిపిన మసాలాలో ఊరిన మామిడికాయ ముక్కలు,
శనగలు కూడా బాగా కలపాలి.



కలిపిన మామిడికాయ ముక్కలు మసాలాలో 
తగినంత నూనె పోయాలి.

@ పచ్చడిలో వేరుశనగ నూనె కానీ,నువ్వుల నూనె కానీ
వరి ఇష్టాని బట్టి వాళ్ళు వాడొచ్చు.@


నూనె,మసాలా పొడులు,మామిడికాయముక్కలు,శనగలు
అన్నీ బాగా కలిసేలా కలిపి శుభ్రమైన జాడీలో పెడితే 
శనగల మామిడి ఆవకాయ రెడీ

3 రోజుల తర్వాత పచ్చడి అంతా ఒకసారి బాగా కలిపి,
నూనె సరిపోయిందా లేదా చూసి 
అవసరమైతే ముక్కలపై తేలేలా మరికొంత నూనె కలపాలి.


5 వ రోజుకి పులుపు,ఉప్పు,కారం పీల్చుకుని 
బాగా ఉబ్బిన  శనగలు చాలా రుచిగా ఉంటాయి. 

@ శనగల పరిమాణంలో తేడా ఈ ఫోటోలో చూడొచ్చు.@




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు